!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 417-420
శ్లోకము 417
ప్రారబ్ధసూత్రాగ్రథితమ్ శరీరం
ప్రయాతు వా తిష్ఠతు గోరివ స్రక్।
న తత్ పునః పశ్యతి తత్త్వవేత్తా
నన్దాత్మనా బ్రహ్మణి లీనవృత్తిః॥
1 ప్రారబ్ధసూత్రాగ్రథితమ్ శరీరం -
ప్రారబ్ద కర్మ అనబడు దారముచే పెనవేయబడిన ఈ శరీరము;
ఈ శరీరము ప్రారబ్ద కర్మ అనే దారముతో పెనవేయబడినది - అది ముందు శ్లోకాలలో విన్నాము. అట్టి శరీరానిని వదిలి వేయాలి అని, అలాగే పండితులలో శ్రేష్ఠుడు ఆ శరీరాన్ని శవముతో సమానముగా చూస్తాడు అని ముందు శ్లోకాలలో విన్నాము. ఇక్కడ గురువు ఇంకో ఉపమానము చెపుతున్నాడు.
2 ప్రయాతు వా తిష్ఠతు గోః స్రక్ ఇవ-
గోవు యొక్క మాలవలె పోనిమ్ము, ఉండనిమ్ము
పండగలలో ఆవు మెడలో పూలహారము వేస్తారు, పూజిస్తారు. ఆ పూలహారముతో ఆవుకి ఏమీ పట్టదు. అది వున్నా లేకపోయినా ఒకటే. అలాగే ఆత్మ జ్ఞానము కలవాడికి కూడా ఆ మాల, అంటే ప్రారబ్ద కర్మ అనబడు దారముచే పెనవేయబడిన ఈ శరీరము అనబడె మాల వున్నా లేకపోయినా ఒకటే. అది గురువు చెపుతున్న మాట.
4 నన్దాత్మనా బ్రహ్మణి లీనవృత్తిః -
ఆనందస్వరూపముతో బ్రహ్మ యందు లీనమైన వృత్తి గల;
3 న తత్ పునః పశ్యతి తత్త్వవేత్తా -
తత్త్వవేత్త మళ్ళీ చూడడు;
ఆవు ఆ మాల చూసి మురిసి పోదు. అలాగే ఆనందస్వరూపముతో బ్రహ్మ యందు లీనమైన తత్త్వవేత్త కూడా ఆ శరీర మాలతో మురిసిపోడు చూడడు
417 వ శ్లోక తాత్పర్యము:
ఆనంద స్వరూపమైన పరబ్రహ్మములో లీనమైన భావనతో వున్న (నన్దాత్మనా బ్రహ్మణి లీనవృతత్తిః) తత్త్వవేత్త, ప్రారబ్ద కర్మ అనబడు దారముచే పెనవేయబడిన (ప్రారబ్ధసూత్రాగ్రథితమ్) ఈ శరీరము, ఆవు మెడలో వేసిన దండవలె, వున్నను పోయిననూ ఒకటే కనుక దానిని లక్ష్య పెట్టడు.
శ్లోకము 418:
అఖణ్దానన్దమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః।
కిమిచ్ఛన్ కస్య వా హేతోః దేహం పుష్ణాతి తత్త్వవిత్॥
1 అఖణ్దానన్దమాత్మానం -
అఖండానన్ద స్వరూపుడయిన పరమాత్మగా
2 విజ్ఞాయ స్వస్వరూపతః -
తన నిజ స్వరూపమును తెలిసికొని
3 కిమిచ్ఛన్ కస్య వా హేతోః -
దేనికోసము ఎవరికోసము
4 దేహం పుష్ణాతి తత్త్వవిత్ -
తత్త్వము తెలిసినవాడు దేహమును పోషించును?
418 వ శ్లోక తాత్పర్యము:
తన నిజ స్వరూపమును అఖండానన్ద స్వరూపుడయిన పరమాత్మగా తెలిసికొనిన తత్త్వవేత్త, దేనిని ఆశించి , లేక ఎవరికొఱకు , ఈ శరీరమును పోషించుచుండవలెను?
బ్రహ్మత్వము పొందిన తత్త్వవేత్తకి ఈ శరీరము తో పనిలేదు.
శ్లోకము 419
సంసిద్ధస్య ఫలం ఏతత్ జీవన్ముక్తస్య యోగినః।
బహిః అన్తః సదానన్ద రసాస్వాదనం ఆత్మని॥
1 జీవన్ముక్తస్య యోగినః -
జీవన్ముక్తుడైన యోగికి
2 సంసిద్ధస్య ఫలం ఏతత్ -
సిద్ధి పొందడముయొక్క ఫలము ఇది
జీవన్ముక్తుడైన యోగికి సిద్ధి పొందడము వలన వచ్చిన ఫలము ఏమిటి? దానికి సమాధానము అఖండ ఆనంద భావము. అదే గురువు చెప్పేమాట.
3 బహిః అన్తః -
లోపల బయట;
4 సదానన్ద రసాస్వాదనం ఆత్మని -
ఎల్లప్పుడు తనలో ఆనందరసమును అస్వాదించుటయే;
లోపల బయటా అంతటా ఎల్లప్పుడు తనలో ఆనందరసమును అస్వాదించుటయే జీవన్ముక్తుడైన యోగికి సిద్ధి పొందడము వలన వచ్చిన ఫలము
419 వ శ్లోక తాత్పర్యము :
"సిద్ధి పొంది జీవన్ముక్తుడైన యోగికి - లోపల బయటా ఆత్మ తత్త్వము అయిన సదానంద రసానుభవమే ఫలము" ;
అత్మానుభవము కలిగినవాడికి , బ్రహ్మత్వము పొందినవానికి, మనపరిభాషలో మోక్షము పొందినవారికి, అన్ని బంధములన నుంచి బయట పడడముతో, సాక్షి రూపముతో కూడిన వైరాగ్యముతో కలిగేది పరమ శాంతి . ఆ పరమ శాంతి యే ఆనందరసము. దాని అనుభవించడమే ఆ జీవుడికి ( అత్మానుభవము కలిగినవాడికి...ఇత్యాది) దొరికిన ఫలము.
సిద్ధి పొందిన వారి చిహ్నము, సదానంద రసానుభవము అంటె ఎల్లప్పుడు చిరునవ్వు వికసించిన ముఖము, సమస్త జీవరాశులపై సమత్వము.
గురువు ఈ శ్లోకములో చెప్పినది అదే.
ఫలము అన్నమాటతో గురువు వైరాగ్యము, జ్ఞానము, ఉపరతి పరమ శాంతి అనే నాలుగు దశలలో వచ్చే ఫలము గుర్తుచేస్తాడు మనకి
శ్లోకము 420:
వైరాగ్యస్య ఫలం బోధః
బోధస్య ఉపరతిః ఫలం।
స్వానన్దానుభవాత్ శాన్తిః
ఏషైవోపరతిః ఫలమ్॥
1 వైరాగ్యస్య ఫలం బోధః -
వైరాగ్యము యొక్క ఫలము బోధన;
బోధన అని అనడములో గురువు మాట బొధన ద్వారా కలిగిన జ్ఞానము.
అంటే వైరాగ్యము యొక్క ఫలము జ్ఞానము
2 బోధస్య ఉపరతిః ఫలం -
జ్ఞానము యొక్క ఫలము ఉపరతి;
ఉపరతి అంటే మనస్సులో ఇన్ద్రియనిగ్రహము. జ్ఞానము వలన వచ్చిన బుద్ధితో మనస్సును ఇన్ద్రియముల వ్యాపారమునుంచి నిగ్రహించడమే ఉపరతి. ఉపరతొతో అమితమైన శాంతి. పరమ శాంతి లభిస్తుంది.
3 స్వానన్దానుభవాత్ శాన్తిః -
తనలోనే ఆనందము వలన శాంతి
4 ఏషై ఏవ ఉపరతిః ఫలమ్ -
అదే ఉపరతి యొక్కఫలము
420 వ శ్లోక తాత్పర్యము:
వైరాగ్యము వలన కలుగు ఫలము ఆత్మ జ్ఞానము; బోధనవలన వచ్చిన జ్ఞానముతో కలుగు ఫలము ఉపరతి; ఉపరతివలన కలుగు ఫలము తనలో తాను ఆనందానుభవము పొందుట, దానివలన శాంతి పొందుట: ( వైరాగ్యము వలన జ్ఞానము; జ్ఞానము వలన ఉపరతి ; ఉపరతి వలన శాంతి కలుగును)
॥ఓం తత్ సత్॥
__________________________________