||సుందరకాండ ||

|| అరవై ఏడవ  సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో ||

|| Sarga 67 || with Slokas and meanings in Telugu

                                         

||ఓమ్ తత్ సత్||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ  శ్లోకార్థ తత్త్వదీపికా సహిత

సప్తషష్టితమస్సర్గః||


- ’సర్వం న్యవేదయత రాఘవే’ - 



మధురమైన,  మధురమైన మాటలు గల, ’నా భామిని, ఎలాగ ఉందో చెప్పమని అడిగిన రామచంద్రుని మాటలకు సమాధానముగా,  ’సీతావృత్తాంత కోవిదుడు’, అంటే హనుమ, సీతమ్మతో తన సంభాషణ అంతా - సర్వం న్యవేదయత రాఘవే-  రాఘవునకు సంపూర్ణముగా నివేదించెను అంటాడు కవి.  మళ్ళీ అంతా చెప్పి చివరిలో,  ’నా సమగ్రమైన మాటల ద్వారా సీతమ్మ కుశలమే అని తెలుసుకొనుము’, అని చెపుతాడు. నియతాం అక్షతాం దేవీమ్ లాగా, సీతాం సమగ్రాం కుశలాం కూడా , సాంత్వనము కలిగించే మాట.


ఈ సారి హనుమ  చిత్రకూటములో జరిగిన వాయస వృత్తాంతము, సీత మాటలలో వివరిస్తాడు. వాయస వృత్తాంతము చెప్పి, మళ్ళీ సీత మాటలలో సీత అడిగిన ప్రశ్నలన్నిటినీ చెపుతాడు. దుఃఖభారముతో నిండిన సీతమ్మ మనస్సును శాంతిపరచడానికి, తను  చెప్పిన మాటలు రామునికి చెపుతాడు.


ఇప్పుడు అరవై ఏడవ సర్గలో శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.


||శ్లోకము 67.01||


ఏవముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా |

సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే ||67.01||


స|| మహాత్మనా రాఘవేణ  ఏవం ఉక్తః తు  హనుమాన్ సీతాయా భాషితం సర్వం న్యవేదయత||


||శ్లోకార్థములు||


మహాత్మనా రాఘవేణ  ఏవం ఉక్తః తు 

ఆ రాఘవునిచేత ఆవిధముగా అడగబడినవాడై

హనుమాన్ సీతాయా భాషితం - హనుమంతుడు సీతతో మాట్లాడినది

సర్వం న్యవేదయత - అంతా నివేదించెను


||శ్లోకతాత్పర్యము||


ఆ రాఘవునిచేత ఆవిధముగా అడగబడిన హనుమంతుడు సీతతో మాట్లాడినది అంతా నివేదించెను. ||67.01||


||శ్లోకము 67.02||


ఇదముక్తవతీ దేవీ జానకీ పురుషర్షభ |

పూర్వవృత్త మభిజ్ఞానం చిత్రకూటే యథాతథమ్ ||67.02||


స|| పురుషర్షభ దేవీ జానకీ చిత్రకూటే పూర్వ వృత్తం  అభిజ్ఞానం ఇదం ఉక్తవతీ యథా తథమ్||


||శ్లోకార్థములు||


పురుషర్షభ దేవీ జానకీ   - ఓ పురుషోత్తమా ! దేవి జానకి 

చిత్రకూటే పూర్వ వృత్తం - 

చిత్రకూటములో జరిగిన పూర్వ వృత్తాంతము 

ఇదం అభిజ్ఞానం యథా తథమ్ ఉక్తవతీ  -

ఈ జ్ఞాపక చిహ్నము, ఉన్నది ఉన్నట్లుగా చెప్పెను


||శ్లోకతాత్పర్యము||


’ఓ పురుషోత్తమా ! దేవి జానకి పూర్వము చిత్రకూటములో జరిగిన వృత్తాంతము, నీకు జ్ఞాపక చిహ్నముగా,  ఉన్నది ఉన్నట్లుగా చెప్పెను’. ||67.02||


||శ్లోకము 67.03||


సుఖసుప్తా త్వయా సార్థం జానకీ పూర్వముత్థితా |

వాయసః సహసోత్పత్య విదదార స్తనాంతరే ||67.03||


స|| త్వయా సార్థం సుఖసుప్తా జానకీ పూర్వం ఉత్థితా వాయసః సహసా ఉత్పత్య స్తనాంతరే విదదార||


||శ్లోకార్థములు||


త్వయా సార్థం సుఖసుప్తా జానకీ - 

నీ దగ్గర సుఖముగా నిద్రించి వున్న సీత  

పూర్వం ఉత్థితా - ముందు మేల్కొనెను

వాయసః సహసా ఉత్పత్య - ఒక వాయసము  త్వరగా ఎగిరివచ్చి

 స్తనాంతరే విదదార - స్తనముల మధ్యలో పొడెచెను


||శ్లోకతాత్పర్యము||


’ఓకప్పుడు నీ దగ్గర సుఖముగా నిద్రించి వున్న సీత  నీకన్న ముందు మేల్కొనెను. అప్పుడు ఒక వాయసము ఆమె స్తనముల మధ్య పొడెచెను’. ||67.03||


||శ్లోకము 67.04||


పర్యాయేణ చ సుప్తత్వం దేవ్యంకే భరతాగ్రజ |

పునశ్చ కిల పక్షీ స దేవ్యా జనయతి వ్యథామ్ ||67.04||


స|| భరతాగ్రజ త్వం పర్యాయేణ దేవ్యంకే సుప్తః సః పక్షీ పునశ్చ దేవ్యాః వ్యథామ్ జనయతి కిల ||


||శ్లోకార్థములు||


భరతాగ్రజ త్వం పర్యాయేణ - 

భరతాగ్రజుడవైన రామా, ఆ తరువాత నీవు మళ్ళీ

దేవ్యంకే సుప్తః  - నీవు దేవి అంకములో నిద్రపోయివట

సః పక్షీ పునశ్చ దేవ్యాః - ఆ పక్షి మళ్ళీ  ఆ దేవికి  

వ్యథామ్ జనయతి కిల- బాధ కలిగించెనుట 


||శ్లోకతాత్పర్యము||


’భరతాగ్రజుడవైన ఓ రామా, ఆ తరువాత నీవు దేవి అంకములో నిద్రపోయివట. ఆ పక్షి మళ్ళీ వచ్చి ఆ దేవికి  బాధ కలిగించెనుట’. ||67.04||


||శ్లోకము 67.05||


పునః పునరుపాగమ్య విదదార భృశం కిల |

తతస్త్వం బోధితస్తస్యాః శోణితేన సముత్‍క్షితః ||67.05||


స|| పునః పునః ఉపాగమ్య భృశం విదదార కిల | తతః త్వం తస్యాః శోణితేన సముక్షితః బోధితః కిల||


||శ్లోకార్థములు||


పునః పునః ఉపాగమ్య - (ఆ పక్షి) మళ్ళీ మళ్ళీ వచ్చి 

భృశం విదదార కిల - (ఆ దేవికి)  అమితమైన బాధ కలిగించెను

తతః త్వం తస్యాః శోణితేన సముక్షితః - 

అప్పుడు నువ్వు రక్తపు చుక్కలతో  తడపబడి

బోధితః కిల- మేల్కొన్నావట


||శ్లోకతాత్పర్యము||


'ఆ పక్షి మళ్ళీ వచ్చి ఆ దేవికి  బాధ కలిగించెను. అప్పుడు నువ్వు ఆ గాయమునుండి కారిన రక్తపు చుక్కలతో తడపబడి మేల్కొన్నావట’. ||67.05||


||శ్లోకము 67.06||


వాయసేవ చ తే నైవ సతతం బాధ్యమానయా |

బోధితః కిల దేవ్యా త్వం సుఖసుప్తః పరంతప ||67.06||


స|| పరన్తప తేన వాయసేనైవ సతతం బాధ్యమానయా దేవ్యా సుఖసుప్తః త్వం బోధితః కిల||


||శ్లోకార్థములు||


పరన్తప తేన వాయసేనైవ -

 శత్రువులను తపించు ఓ రామా! ఆ వాయసము చేతనే 

సతతం బాధ్యమానయా  - 

మళ్ళీ మళ్ళీ బాధించ బడడముతో 

దేవ్యా సుఖసుప్తః త్వం -  

దేవి సుఖముగా నిద్రించుచున్న నీకు 

బోధితః కిల - చెప్పినదట


||శ్లోకతాత్పర్యము||


’శత్రువులను తపించు ఓ రామా! ఆ వాయసము చేతనే మళ్ళీ మళ్ళీ బాధించ బడడముతో ఆ దేవి సుఖముగా నిద్రించుచున్న నీకు చెప్పినదట’. ||67.06|| 


||శ్లోకము 67.07||


తాం తు దృష్ట్వా మహాబాహో దారితాం చ స్తనాంతరమ్ |

అశీ విష ఇవ క్రుద్ధో నిశ్వసన్ అభ్యభాషథాః ||67.07||


స|| మహాబాహో స్తనాన్తరే దారితామ్  తామ్ దృష్ట్వా కృద్ధః ఆశీవిషైవ నిఃశ్వసన్ అభ్యభాషథాః||


||శ్లోకార్థములు||


మహాబాహో స్తనాన్తరే దారితామ్  - 

ఓ మహాబాహో ! స్తనముల మధ్యలో గీరబడి వున్న 

తామ్ దృష్ట్వా కృద్ధః - 

ఆమెను చూచి కోపముతో

ఆశీవిషైవ నిఃశ్వసన్ - 

రెచ్చిపోయిన పాములా బుసలు కొడుతూ

అభ్యభాషథాః- ఇట్లు చెప్పితివట. 


||శ్లోకతాత్పర్యము||


’ఓ మహాబాహో ! స్తనముల మధ్యలో గీరబడి వున్న ఆమెను చూచి కోపముతో, రెచ్చిపోయిన పాములా బుసలు కొడుతూ, నీవు ఇట్లు చెప్పితివట’. ||67.07|| 


||శ్లోకము 67.08||


నఖాగ్రైః కేన  తే భీరు దారితం తు స్తనాంతరమ్ |

కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా ||67.08||


స|| భీరు తే స్తనాంతరం కేన నఖాగ్రైః దారితం| సరోషేన పంచవక్త్రేణ భోగినా కః క్రీడతి||


||శ్లోకార్థములు||


భీరు తే స్తనాంతరం - 

ఓ భయస్థురాలా !నీ స్తనముల మధ్యలో 

కేన నఖాగ్రైః దారితం - ఎవరు తమ గోళ్ళతో గీకిరి?

సరోషేన పంచవక్త్రేణ భోగినా - 

రోషముతో నిండిన ఇదు తలల పాముతో 

 కః క్రీడతి - ఎవరు ఆటలాడ గోరుచున్నారు?


||శ్లోకతాత్పర్యము||


’ఓ భయస్థురాలా, నీ స్తనముల మధ్యలో ఎవరు తమ గోళ్ళతో గీకిరి? రోషముతో నిండిన ఇదు తలల పాముతో ఎవరు ఆటలాడ గోరుచున్నారు?’ అని. ||67.08||


||శ్లోకము 67.09||


నిరీక్షమాణః సహసా వాయసం సమవైక్షథాః |

నఖైః సరుధిరైః తీక్ష్‍ణైః తామేవాభిముఖం స్థితమ్ ||67.09||


స|| నిరీక్షమాణః  సరుధిరైః తీక్షణైః నఖైః తామేవ అభిముఖం వాయసం సహసా సమవైక్షత||



||శ్లోకార్థములు||


నిరీక్షమాణః  - అలా నిరీక్షుచుండగా

సరుధిరైః తీక్షణైః నఖైః - 

రక్తముతో కూడిన తీక్షణమైన గోళ్లతో 

తామేవ అభిముఖం వాయసం - 

ఆమెకు ఎదురుగా వున్నవాయసమును

సహసా సమవైక్షత - వెంటనే చూచితివి


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు అలా నిరీక్షించి తీక్షణమైన గోళ్లతో ఎదురుగా వున్న వాయసమును చూచితివి’. ||67.09||


||శ్లోకము 67.10||


సుతః కిల స శక్రస్య వాయసః పతతాం వరః |

ధరాంతరచరశ్శీఘ్రం పవనస్య గతౌ సమః ||67.10||


స|| పతతామ్ వరః సః వాయసః శక్రస్య పుత్రః| ధరాంతరచరశ్శీఘ్రం కిల | శీఘ్రం గతౌ పవనస్య సమః||


||శ్లోకార్థములు||


పతతామ్ వరః - పక్షులలో శ్రేష్ఠుడు 

సః వాయసః శక్రస్య పుత్రః - 

ఆ వాయసము ఇంద్రుని పుత్రుడట

ధరాంతరచరశ్శీఘ్రం కిల  - 

భూమి మీద శీఘ్రముగా పోగలవాడు

శీఘ్రం గతౌ పవనస్య సమః - 

శీఘ్ర గతిలో పవనునితో సమానుడు


||శ్లోకతాత్పర్యము||


’పక్షులలో శ్రేష్ఠుడు అగు అతడు వాయసము ఇంద్రుని పుత్రుడట. భూమి మీద శీఘ్రముగా పోగలవాడు. శీఘ్ర గతిలో పవనునితో సమానుడు’. ||67.10||


||శ్లోకము 67.11||



తతస్తస్మిన్ మహాబాహో కోప సంవర్తితేక్షణః |

వాయసే త్వం కృథాః క్రూరాం మతిం మతిమతాంవర ||67.11||


స|| మహాబాహో మతిమతాం వర కోపసంవర్తితేక్షణః తతః తస్మిన్ వాయసే క్రూరాం మతిం కృథాః||


||శ్లోకార్థములు||


మహాబాహో మతిమతాం వర - 

ఓ మహాబాహో  , బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు రామా 

కోపసంవర్తితేక్షణః తతః - 

అప్పుడు కోపము చిమ్ముతున్న కళ్లతో

తస్మిన్ వాయసే క్రూరాం మతిం కృథాః - 

అ వాయసముపై శిక్షవిధించుటకు ఆలోచించితివట


||శ్లోకతాత్పర్యము||


’ఓ మహాబాహో  , బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు రామా ! అప్పుడు కోపము చిమ్ముతున్న కళ్లతో ఆ వాయసముపై శిక్షవిధించుటకు ఆలోచించితివట’. ||67.11||


||శ్లోకము 67.12||


సదర్భం సంస్తరాద్గృహ్య బ్రహ్మాస్త్రేణ హ్యయోజయః |

ప్రదీప్త ఇవ కాలాగ్నిః జజ్వాలాభిముఖః ఖగమ్ ||67.12||


స|| సః సంస్తరాత్ దర్భం గృహ్య బ్రాహ్మేణ అస్త్రేణ యోజయత్| సః దీప్తః కాలాగ్నిః ఇవ ద్వైజం అభిముఖః జజ్వాల||



||శ్లోకార్థములు||


సః సంస్తరాత్ దర్భం గృహ్య - 

అప్పుడు దర్భాసనము నుండి ఒక దర్బను తీసుకొని

 బ్రాహ్మేణ అస్త్రేణ యోజయత్  - 

దానిని  బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించివట

సః దీప్తః కాలాగ్నిః ఇవ - 

అది కాలాగ్నివలె మండుతూ  

ద్వైజం అభిముఖః జజ్వాల - 

ఆ పక్షికి అభిముఖముగా ప్రజ్వరిల్లినదట


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు దర్భాసనము నుండి ఒక దర్బను తీసుకొని, దానిని  బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించివట. అది కాలాగ్నివలె జ్వలిస్తూ ఆ పక్షి అభిముఖముగా ప్రజ్వరిల్లినదట.’ ||67.12||


||శ్లోకము 67.13||


క్షిప్తవాం స్త్వం ప్రదీప్తం హి దర్భం తం వాయసం ప్రతి |

తతస్తు వాయసం దీప్తః సదర్భోఽనుజగామ హ ||67.13||


స|| త్వం ప్రదీప్తం తం దర్భం వాయసం ప్రతి క్షిప్తవాన్ | తతః స దర్భః దీప్తః వాయసం ప్రతి అనుజగామ హ||


||శ్లోకార్థములు||


త్వం ప్రదీప్తం తం దర్భం - 

నీవు ప్రజ్వలిస్తున్న ఆ దర్భను 

వాయసం ప్రతి క్షిప్తవాన్ - 

వాయసముపై ప్రయోగించితివట

తతః స దర్భః దీప్తః - 

అప్పుడు ఆ జ్వలిస్తున్న ఆ దర్భ

వాయసం ప్రతి అనుజగామ హ - 

  వాయసము వెంట బడెను


||శ్లోకతాత్పర్యము||


’ఆ ప్రజ్వలిస్తున్న ఆ దర్భను ఆ వాయసముపై ప్రయోగించితివట. అప్పుడు ఆ జ్వలిస్తున్న ఆ దర్భ ఆ  వాయసము వెంట బడెను’. ||67.13||


||శ్లోకము 67.14||


స పిత్రా చ పరిత్యక్తైః సురైశ్చ సమహర్షిభిః |

త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్ఛతి ||67.14||


స|| సః పిత్రా  సమహర్షిభిః సురైశ్చ పరిత్యక్తః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం న అధిగచ్ఛతి|| 


||శ్లోకార్థములు||


సః పిత్రా  - 

ఆ వాయసము తండ్రి చేత 

సమహర్షిభిః సురైశ్చ పరిత్యక్తః - 

సురలచేత మహర్షిభిల చేత వదిలివేయబడినవాడై

 త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య - మూడు లోకములను తిరిగినా 

త్రాతారం న అధిగచ్ఛతి- రక్షించువాడు లభించలేదట


||శ్లోకతాత్పర్యము||


’ఆ వాయసము తండ్రి చేత సురలచేత మహర్షిభిల చేత వదిలివేయబడినవాడై మూడు లోకములను తిరిగినా రక్షైంచువాడు లభించలేదట.’ ||67.14||


||శ్లోకము 67.15||


పునరేవాగతస్త్రస్తః త్వత్సకాశ మరిందమ |

స తం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతమ్ ||67.15||

వధార్హమపి కాకుత్‍స్థ కృపయా పర్యపాలయః |


స|| అరిన్దమ త్రస్తః పునరేవ త్వత్ సకాశం ఆగతః శరణ్యః |సః కాకుత్‍స్థః శరణాగతం భూమౌ  నిపతితాం తం వధార్హం అపి కృపయా పర్యపాలయః||


||శ్లోకార్థములు||


అరిన్దమ త్రస్తః పునరేవ - 

ఓ అరిందమ ! భయముతో మళ్ళీ 

 త్వత్ సకాశం ఆగతః శరణ్యః - 

నీ దగ్గరకే శరణు కోసము వచ్చెనట.

సః కాకుత్‍స్థః 

శరణాగతం భూమౌ  నిపతితాం తం - 

శరణుకై వచ్చి భూమి మీద పడిన దానిని 

వధార్హం అపి - వధించుటకు తగినది అయినా 

కృపయా పర్యపాలయః - దయతో రక్షించితివట


||శ్లోకతాత్పర్యము||


’ఓ అరిందమ ! భయముతో మళ్ళీ నీదగ్గరకే శరణు కోసము వచ్చెనట. ఆ వాయసము కాకుత్‍స్థుని శరణుకై వచ్చి భూమి మీద పడినప్పుడు, అది వధించుటకు తగినది అయినా నువ్వు దయతోరక్షించితివట.’ ||67.15||


||శ్లోకము 67.16||


మోఘమస్త్రం న శక్యం  తు కర్తు మిత్యేవ రాఘవ ||67.16||

భవాంస్తస్యాక్షి కాకస్య హినస్తిస్మ స దక్షిణమ్ |


స|| రాఘవ అస్త్రం మోఘం కర్తుం న శక్యం  ఇత్యేవ భవాన్ తస్య కాకస్య దక్షిణం అక్షి హినస్తి స్మ||


రామటీకాలో- మోఘమితి| అస్త్రం మోఘం సర్వథా విఫలమ్ కర్తుం న శక్యం ఇతి హేతోరేవ దక్షిణమక్షి భవాన్ హినస్తి|


||శ్లోకార్థములు||


రాఘవ అస్త్రం మోఘం కర్తుం న శక్యం  - 

ఓ రాఘవా! ఆ అస్త్రమును వ్యర్థము చేయుటకు వీలు లేక 

ఇత్యేవ భవాన్ - అందుకని నీవు 

తస్య కాకస్య దక్షిణం అక్షి- ఆ వాయసముయొక్క దక్షిణ నేత్రమును 

 హినస్తి స్మ - తీసుకొనబడినదిట


||శ్లోకతాత్పర్యము||


’ఓ రాఘవా! ఆ అస్త్రమును వ్యర్థము చేయుటకు వీలు లేక ఆ ఆస్త్రముతో ఆ వాయసముయొక్క దక్షిణ నేత్రమును తీసుకొనబడినదిట’. ||67.16|| 


||శ్లోకము 67.17||


రామం త్వాం స నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ ||67.17||

విసృష్టస్తు తదా కాకః  ప్రతిపేదే స్వమాలయమ్ |


స|| రామ తదా సః కాకః విసృష్టః త్వామ్ రాజ్ఞే దశరథాయ చ నమస్కృత్య స్వం ఆలయం ప్రతిపేదే||


రామ టీకాలో - దశరథం నమస్కృత్య అనేన  పలాయన సమయే దశరథోపదేసేనైవ రామశరణమాగతం ఇతి ధ్వనితమ్| ఏతేన తస్మిన్  కాలే ఆకేటాజన్యతమనిమిత్తేన తస్య త్రిలోకీమధ్యే ఆగమో జాత ఇతి ధ్వనితం |


||శ్లోకార్థములు||


రామ తదా సః కాకః విసృష్టః - 

ఓ రామా అప్పుడు ఆ వాయసము బ్రహ్మాస్త్రముచే వదలబడి

త్వామ్ రాజ్ఞే దశరథాయ చ నమస్కృత్య- 

నీకు అదేవిధముగా మహారాజు దశరథునకు నమస్కరించి

స్వం ఆలయం ప్రతిపేదే - 

తన ఆలయమునకు పోయెనట


||శ్లోకతాత్పర్యము||


’ఓ రామా అప్పుడు ఆ వాయసము , బ్రహ్మాస్త్రముచే వదలబడి, నీకు అదేవిధముగా మహారాజు దశరథునకు నమస్కరించి, తన ఆలయమునకు పోయెనట’. ||67.17||


ఇక్కడ వెళ్ళిపోతూ దశరథునికి వాయసము నమస్కరించినది అని అనడములో , రాముని శరణాగతి కోరమని ఉపదేశమిచ్చినది , దశరథుడే అని ధ్వని అని అంటారు గోవిన్దరాజులవారు తమ టీకాలో. అంటే దశరథుడు కూడా స్వర్గలోకవాసి కనక , ఇంద్రుని పుత్రుడగు ఆ వాయసము కూడా స్వర్గలోకావసి యే కనుక , దశరథుడు ఉపదేశము ఇచ్చివుండునని ధ్వని.


||శ్లోకము 67.18||


ఏవమస్త్ర విదాం శ్రేష్ఠః సత్త్వవాన్  శీలవానపి ||67.18||

కిమర్థమస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః |


స|| శీలవాన్ అపి రాఘవ ఏవం అస్త్రవిదామ్ శ్రేష్ఠః సత్యవాన్  బలవాన్ అపి రక్షస్సు అస్త్రం  కిమర్థం న యోజయతి||


||శ్లోకార్థములు||


శీలవాన్ అపి రాఘవ - 

శీలవంతుడైన రాఘవుడు 

ఏవం అస్త్రవిదామ్ శ్రేష్ఠః - 

ఈ విధముగా అస్త్రవేత్తలలో శ్రేష్థుడు

సత్యవాన్  బలవాన్ అపి -

సత్యవంతుడు, బలవంతుడు అయికూడా 

రక్షస్సు అస్త్రం  కిమర్థం న యోజయతి - ఆ రాక్షసులమీద ఎందుకు అస్త్రములు ప్రయోగించడు?


||శ్లోకతాత్పర్యము||


’ శీలవంతుడైన రాఘవుడు అస్త్రవేత్తలలో శ్రేష్థుడు, సత్యవంతుడు, బలవంతుడు అయికూడా ఆ రాక్షసులమీద ఎందుకు అస్త్రములు ప్రయోగించడు? ’ ||67.18||


||శ్లోకము 67.19||


న నాగా నాపి గంధర్వా నా సురా న మరుద్గణాః ||67.19||

న చ సర్వే రణే శక్తా రామం ప్రతి సమాసితుమ్ |


స|| రణే రామం ప్రతి సమాసితుం నాగాః న సురాః న మరుద్గణాః న గంధర్వాః న ||


||శ్లోకార్థములు||


రణే రామం ప్రతి సమాసితుం శక్తా - 

రణములో రాముని ఎదురుగా నిలబడుటకు   

  నాగాః న సురాః - 

నాగులు సురలు తగరు

న మరుద్గణాః న గంధర్వాః  - 

మరుద్గణములు కాని, గంధర్వులు కాని  తగరు


||శ్లోకతాత్పర్యము||


’రణములో రాముని ఎదురుకొనుటకు నాగులు సురులు మరుద్గణముల్కు కాని, గంధర్వులు కాని  సమర్థులు కారు కదా’. ||67.19||


||శ్లోకము 67.20||


తస్య వీర్యవతః కశ్చిత్ యద్యస్తి మయి సంభ్రమః ||67.20||

క్షిప్రం సునుశితైర్బాణైః హన్యతాం యుధిరావణః |


స|| వీర్యవతః తస్య మయి సంభ్రమః అస్తి యది సునిశితైః బాణైః రావణః క్షిప్రం యుధి హన్యతామ్||


||శ్లోకార్థములు||


వీర్యవతః తస్య - వీరోత్తము డైన ఆయనకి 

మయి సంభ్రమః అస్తి యది -  

నా గురించి  కించుత్తు సంభ్రమము అయితే  

సునిశితైః బాణైః రావణః - 

సునిశితమైన బాణములతో రావణుని 

క్షిప్రం యుధి హన్యతామ్ - 

వెంటనే యుద్ధములో హతమార్చును కదా


||శ్లోకతాత్పర్యము||


’వీరోత్తము డైన ఆయనకి ( నాగురించి)  కించుత్తు సంభ్రమము అయితే సునిశితమైన బాణములతో రావణుని యుద్ధములో వెంటనే యుద్ధములో హతమార్చును కదా.’  ||67.20||


||శ్లోకము 67.21||


భ్రాతు రాదేశ మాజ్ఞాయ లక్ష్మణో వా పరంతపః ||67.21||

స కిమర్థం నరవరో న మాం రక్షతి రాఘవః |


స|| పరన్తపః నరవరః రాఘవః వా భ్రాతుః ఆదేశం ఆజ్ఞాయ మాం కిమర్థమ్ న రక్షతి||


||శ్లోకార్థములు||


పరన్తపః నరవరః రాఘవః - 

పరంతపుడు నరులలో శ్రేష్ఠుడైన రాఘవుడు 

వా భ్రాతుః ఆదేశం ఆజ్ఞాయ - లేక అన్నగారి ఆదేశము తీసుకొని

మాం కిమర్థమ్ న రక్షతి - నన్ను ఎందుకు రక్షించరు?


||శ్లోకతాత్పర్యము||


’పరంతపుడు నరులలో శ్రేష్ఠుడైన రాఘవుడు లేక అన్నగారి ఆదేశము తీసుకొని  లక్ష్మణుడు  కాని నన్ను ఎందుకు రక్షించరు.’ ||67.21|| 


||శ్లోకము 67.22||


శక్తౌతౌ పురుషవ్యాఘ్రౌ వాయ్వగ్నిసమతేజసౌ ||67.22||

సురాణామపి దుర్దర్షౌ కిమర్థం మాముపేక్షతః |


స||  వాయ్వగ్ని సమతేజసః శక్తౌ పురుషవ్యాఘ్రౌ తౌ సురాణాం దుర్ధర్షౌ యది అపి మామ్ కిమర్థం ఉపేక్షతః||


||శ్లోకార్థములు||


వాయ్వగ్ని సమతేజసః శక్తౌ  - 

వాయువు అగ్ని తో సమానమైన తేజస్సు శక్తి కల 

పురుషవ్యాఘ్రౌ తౌ - 

ఆ పురుష వ్యాఘ్రములు ఇద్దరూ

సురాణాం దుర్ధర్షౌ యది అపి - 

దేవతలకు కూడా అసాధ్యులైన వారు  

మామ్ కిమర్థం ఉపేక్షతః - 

నన్ను ఎందుకు ఉపేక్షించుచున్నారు? 


||శ్లోకతాత్పర్యము||


’వాయువు అగ్ని తో సమానమైన తేజస్సు శక్తి కల ఆ పురుష వ్యాఘ్రులు, దేవతలకు కూడా లొంగని వారు, నన్నుఎందుకు ఉపేక్షించుచున్నారు? ’ ||67.22|| 


||శ్లోకము 67.23||


మమైవ దుష్కృతం కించిన్మహదస్తి న సంశయః ||67.23||

సమర్థౌ సహితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ |


స||  మమైవ మహత్ కించిత్ దుష్కృతం  అస్తి | సంశయః న | యత్ సమర్థావపి పరన్తపౌ తౌ మామ్ న అవేక్షేతే ||


||శ్లోకార్థములు||


మమైవ మహత్ కించిత్ దుష్కృతం  అస్తి -

నా చేత ఏదో మహత్తరమైన దుష్కృతము చేయబడినది 

సంశయః న  - సంశయము లేదు

యత్ సమర్థావపి - 

అందువలనే సమర్థులైనా 

పరన్తపౌ తౌ మామ్ న అవేక్షేతే - 

నన్ను నిర్లక్ష్యము చేయుచున్నారు


||శ్లోకతాత్పర్యము||


’నాచేత ఏదో మహత్తరమైన దుష్కృతమైనది. సందేహము లేదు. అందువలనే సమర్థులైనా ఆ పరంతపులు నన్ను నిర్లక్ష్యము చేయుచున్నారు’. ||67.23|| 


||శ్లోకము 67.24||


వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితమ్ ||67.24||

పునరప్యహ మార్యాం తా మిదం వచనమబ్రువమ్ |


స|| కరుణామ్ సాశ్రుభాషితమ్ వైదేహ్యాః వచనమ్ శ్రుత్వా అహం పునరపి తాం ఆర్యాం ఇదం వచనం  అబ్రవమ్||


||శ్లోకార్థములు||


కరుణామ్ సాశ్రుభాషితమ్ -

 కన్నీరుకార్చుతూ చెప్పిన  

వైదేహ్యాః వచనమ్ శ్రుత్వా - 

వైదేహి వచనములను విని 

అహం పునరపి తాం ఆర్యాం - 

నేను కూడా మళ్ళీ ఆ పూజ్యురాలికి 

ఇదం వచనం  అబ్రవమ్ -

 ఇట్లు చెప్పితిని


||శ్లోకతాత్పర్యము||


 ’కన్నీరుకార్చుతూ చెప్పిన  వైదేహి వచనములను విని నేను కూడా మళ్ళీ ఆ పూజ్యురాలికి ఇట్లు చెప్పితిని’. ||67.24|| 


ఇక్కడ రామునికి హనుమ సీతమ్మ మాటలు యథా తథముగా వివరించాడు.


||శ్లోకము 67.25||


త్వచ్ఛోకవిముఖో రామో దేవి సత్యేన తే శపే ||67.25||

రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే |


స|| దేవి రామః త్వత్ శోకవిముఖః సత్యేన తే శపే | రామే దుఃఖాభిపన్నే లక్ష్మణః పరితప్యతే||


గోవిన్దరాజ టీకాలో- త్వత్ శోకేతి। త్వత్ శోకవిముఖః త్వత్ శోకేన కార్యాన్తర విముఖః।


||శ్లోకార్థములు||


దేవి రామః త్వత్ శోకవిముఖః - 

ఓ దేవీ రాముడు నీ పై శోకముతో అన్ని విషయములలో విముఖుడు

సత్యేన తే శపే  - నీకు సత్యము చెప్పుచున్నాను

రామే దుఃఖాభిపన్నే - రాముడు దుఃఖములో ఉండుటవలన 

లక్ష్మణః పరితప్యతే - లక్ష్మణుడు కూడా పరితపిస్తున్నాడు


||శ్లోకతాత్పర్యము||


’ఓ దేవీ రాముడు నీ పై శోకముతో అన్ని విషయములలో విముఖుడు. నీకు సత్యము చెప్పుచున్నాను. రాముడు దుఃఖములో ఉండుటవలన లక్ష్మణుడు కూడా పరితపిస్తున్నాడు’. ||67.25|| 


||శ్లోకము 67.26||


కథంచిత్ భవతీ దృష్టా న కాలః పరిశోచితుమ్ ||67.26||

అస్మిన్ముహూర్తే దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని |


స|| భామినీ కథంచిత్ భవతీ దృష్టా| పరిదేవితుమ్ కాలః న | ఇమమ్ ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి||


||శ్లోకార్థములు||


భామినీ కథంచిత్ భవతీ దృష్టా - 

ఓ పూజ్యురాలా అదృష్టముకొలదీ నీవు కనపడితివి

పరిదేవితుమ్ కాలః న  - చింతించుటకు సమయము కాదు.

ఇమమ్ ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి - 

ఈ ముహూర్తమే దుఃఖముల అంతము చూచుచున్నావు


||శ్లోకతాత్పర్యము||


’ఓ పూజ్యురాలా అదృష్టముకొలదీ నీవు కనపడితివి. చింతించుటకు సమయము కాదు. ఈ ముహూర్తమే దుఃఖముల అంతము చూచుచున్నావు’. ||67.26||  


||శ్లోకము 67.27||


తావుభౌ నరశార్దూలౌ రాజపుత్రావనిందితౌ ||67.27||

త్వదర్శనకృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః |


స|| నరశార్దూలౌ అనిన్దితౌ మహాబలౌ త్వత్ దర్శన కృతోత్సాహౌ ఉభౌ తౌ రాజపుత్రౌ లంకాం భస్మీకరిష్యతః||


||శ్లోకార్థములు||


నరశార్దూలౌ అనిన్దితౌ మహాబలౌ- 

ఆ నరశార్దూలములు ఇద్దరూ, నిందించతగని మహాబలులు

 త్వత్ దర్శన కృతోత్సాహౌ - నీ దర్శనముపై కల ఉత్సాహముతో  

ఉభౌ తౌ రాజపుత్రౌ - ఆ రాజపుత్రులు ఇద్దరూ

లంకాం భస్మీకరిష్యతః - లంకను భస్మము చేసెదరు


||శ్లోకతాత్పర్యము||


’ఆ నరశార్దూలములు ఇద్దరూ, నిందించతగని మహాబలులు. ఆ రాజపుత్రులు ఇద్దరూ నీ దర్శనమునకు కల ఉత్సాహముతో  లంకను భస్మము చేసెదరు.’ ||67.27|| 


||శ్లోకము 67.28||


హత్వా చ సమరే రౌద్రం రావణం సహబాంధవమ్ ||67.28||

రాఘవస్త్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం |


స|| వరారోహే రాఘవః రౌద్రం సహబాంధవం రావణం సమరే హత్వ చ త్వాం స్వాం పురీమ్ నయతే ధృవమ్||


||శ్లోకార్థములు||


వరారోహే రాఘవః రౌద్రం- 

ఓ సీతా ! రౌద్రుడైన రాఘవుడు

సహబాంధవం రావణం సమరే హత్వా చ - 

రావణుని బంధువులతో కలిపి సమరములో హతమార్చి

త్వాం స్వాం పురీమ్ నయతే ధృవమ్- 

నిన్ను తన పురమునకు తప్పక తీసుకుపోవును


||శ్లోకతాత్పర్యము||


’ఓ సీతా ! రౌద్రుడైన రాఘవుడు, రావణుని బంధువులతో కలిపి సమరములో హతమార్చి నిన్ను తన పురమునకు తప్పక తీసుకుపోవును’. ||67.28|| 


||శ్లోకము 67.29||


యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే ||67.29||

ప్రీతిసంజననం తస్య ప్రదాతుం త్వ మిహార్హసి |’


స|| అనిందితే రామః యత్ విజానీయాత్ తస్య ప్రీతి సంజననం అభిజ్ఞానం ఇహ దాతుం త్వం అర్హసి|| 


ఇవన్నీ కూడా హనుమ సీతమ్మకి  చెప్పినమాటలు యథా తథముగా చెప్పబడ్డాయి.


||శ్లోకార్థములు||


అనిందితే రామః యత్ విజానీయాత్ -

 ఓ దేవీ రామునికీ ఏది తెలుసునో 

 తస్య ప్రీతి సంజననం అభిజ్ఞానం - 

అతని ప్రేమను ప్రతిబింబించు గురుతును

ఇహ దాతుం త్వం అర్హసి - నాకు చెప్పుము


||శ్లోకతాత్పర్యము||


’ఓ దేవీ రామునికీ ఏది తెలుసునో అతని ప్రేమను ప్రతిబింబించు గురుతును నాకు చెప్పుము.' ||67.29|| 


||శ్లోకము 67.30||


సాభివీక్ష్య దిశః సర్వా వేణ్యుద్గ్రథన ముత్తమమ్ ||67.30||

ముక్తావస్త్రాద్దదౌ మహ్యం మణిమేతం మహాబల |


స||మహాబల సా సర్వాః దిశః అభివీక్ష్య వేణ్యుద్‍గ్రథితం ఉత్తమం ఏతం మణిం మహ్యం దదౌ||


రామ టీకాలో - సా సీతా వేణ్యుద్గ్రథనం  వేణ్యాం ఉద్గ్రథనార్హం  ఏతం మణిం వస్త్రాన్ ముక్త్వా నికృష్య మహ్యం దదౌ।


గోవిన్దరాజ టీకాలో - సాభివీక్ష్య దిశ ఇతి। దిగావలోకనం రాక్షస్యో దృష్ట్వారావణాయ వక్ష్యన్తి ఇతి భయేన వేణ్యాముద్ గ్రథ్యత ఇతి వేణ్యుద్ గ్రథనం వేణీధార్యం ఇత్యర్థః। ముక్త్వా వస్త్రాదితి వస్త్రాఙ్చలేన  గ్రథితం మణిం ముక్త్వా తతః దదావిత్యర్థః॥


||శ్లోకార్థములు||


మహాబల సా సర్వాః దిశః అభివీక్ష్య- 

ఓ మహాబలా అప్పుడు ఆమె అన్ని దిశలు పరికించి 

వేణ్యుద్‍గ్రథితం ఉత్తమం ఏతం మణిం - 

తలలో ఉన్న ఈ ఉత్తమమైన మణిని 

ముక్తా వస్త్రాత్ మహ్యం దదౌ- తన వస్త్రములోంచి తీసి నాకు ఇచ్చినది


||శ్లోకతాత్పర్యము||


’ఓ మహాబలా అప్పుడు ఆమె అన్ని దిశలు పరికించి తలలో ఉన్న ఈ ఉత్తమమైన మణిని తన వస్త్రమునుంచి తీసి నాకు ఇచ్చినది’. ||67.30||


||శ్లోకము 67.31||


ప్రతిగృహ్య మణిం దివ్యం తవ హేతో రఘూద్వహ ||67.31||

శిరసా తాం ప్రణమ్యార్యాం అహమాగమనే త్వరే |


స|| రఘూద్వహ దివ్యం మణిం తవ హేతోః ప్రతిగృహ్య ఆర్యాం తాం శిరసా ప్రణమ్య అహం ఆగమనే త్వరే||


||శ్లోకార్థములు||


రఘూద్వహ దివ్యం మణిం - 

’ఓ రఘురామా! ఈ దివ్యమైన మణిని 

మణిం తవ హేతోః ప్రతిగృహ్య - 

నీ కోసమై తీసుకొని 

ఆర్యాం తాం శిరసా ప్రణమ్య - 

పూజనీయురాలైన ఆమెకి నమస్కరించి 

అహం ఆగమనే త్వరే - నేను తిరిగివచ్చుటకు సిద్ధమైతిని


||శ్లోకతాత్పర్యము||


’ఓ రఘురామా! ఈ దివ్యమైన మణిని నీ కోసమై తీసుకొని పూజనీయురాలైన ఆమెకి నమస్కరించి నేను తిరిగివచ్చుటకు సిద్ధమైతిని'. ||67.31||


||శ్లోకము 67.32||


గమనే చ కృతోత్సాహం అవేక్ష్య వరవర్ణినీ ||67.32||

వివర్థమానం  చ హి మామువాచ జనకాత్మజా |


స|| వరవర్ణినీ జనకాత్మజా గమనే కృతోత్సాహం వివర్ధమానం చ మాం ఆవేక్ష్య ఉవాచ||


||శ్లోకార్థములు||


వరవర్ణినీ జనకాత్మజా -

 మంచివన్నెకల జనకాత్మజ

గమనే కృతోత్సాహం - 

తిరుగుప్రయాణముయొక్క ఉత్సాహములో 

వివర్ధమానం చ మాం ఆవేక్ష్య - 

పెరుగుచున్ననన్ను చూచి 

ఉవాచ - (ఆమె మరల) ఇట్లు చెప్పెను


||శ్లోకతాత్పర్యము||


’మంచివన్నెకల జనకాత్మజ, తిరుగుప్రయాణముయొక్క ఉత్సాహములో పెరుగుచున్ననన్ను చూచి ఆమె మరల ఇట్లు చెప్పెను.' ||67.32||  


||శ్లోకము 67.33||


అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పసందిగ్ధభాషిణీ ||67.33||

మమోత్పతనసంభ్రాన్తా శోకవేగసమాహతా |


స|| అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పసందిగ్ధభాషిణీ మమ ఉత్పతనసంభ్రాతా శోకవేగ సమాహతా||


||శ్లోకార్థములు||


అశ్రుపూర్ణముఖీ - కళ్ళనీళ్లతో నిండిన ముఖముతో

దీనా భాష్పసందిగ్ధభాషిణీ - 

దీనముగా నున్న, భాష్పముల వలన కలిగిన గద్గద స్వరముతో

మమ ఉత్పతనసంభ్రాతా - 

నేను వెళ్ళి పోతున్నాననే సంభ్రమముతో

శోకవేగ సమాహతా - శోకముతో కూడినదై 

(ఉవాచ)- (ఇట్లు చెప్పెను)


||శ్లోకతాత్పర్యము||


’కళ్ళనీళ్లతో నిండిన ముఖముతో, భాష్పముల వలన కలిగిన గద్గద స్వరముతో ఇట్లు చెప్పెను’. ||67.33||


||శ్లోకము 67.34||


హనుమన్ సింహసంకాశా వుభౌ తౌ రామలక్ష్మణౌ ||67.34||

సుగ్రీవం చ  సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయమ్ |


స|| హనుమాన్ సింహసంకాశౌ తౌ రామలక్ష్మణౌ ఉభౌ సహామాత్యం సుగ్రీవం చ సర్వాన్ అనామయమ్ బ్రూయాః || 


||శ్లోకార్థములు||


హనుమాన్ సింహసంకాశౌ - 

ఓ హనుమా ! సింహాస్వరూపులైన

తౌ రామలక్ష్మణౌ ఉభౌ - 

ఆ రామలక్ష్మణులిద్దరిని

సహామాత్యం సుగ్రీవం చ సర్వాన్ - 

సుగ్రీవుని అతని అమాత్యులందరినీ  

అనామయమ్ బ్రూయాః - 

క్షేమసమాచారములను చెప్పుము


||శ్లోకతాత్పర్యము||


 ’ఓ హనుమా ! సింహాస్వరూపులైన ఆ రామలక్ష్మణులిద్దరిని, సుగ్రీవుని అతని అమాత్యులందరినీ అడిగినట్లు చెప్పుము.' ||67.34|| 


||శ్లోకము 67.35||


యథా చ స మహాబాహుః మాం తారయతి రాఘవః |

అస్మాదుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి ||67.35||


స|| మహాబాహుః సః రాఘవః అస్మాత్ దుఃఖామ్బుసంరోధాత్ యథా తారయతి త్వం సమాధాతుమ్ అర్హసి||


||శ్లోకార్థములు||


మహాబాహుః సః రాఘవః - మహాబాహువులు కల ఆ రాఘవుడు 

అస్మాత్ దుఃఖామ్బుసంరోధాత్ - నన్ను ఈ దుఃఖసాగరమునుంచి 

యథా తారయతి - ఏ విధముగా రక్షించునో 

త్వం సమాధాతుమ్ అర్హసి - అది నువ్వు చూడుము


||శ్లోకతాత్పర్యము||


’మహాబాహువులు కల ఆ రాఘవుడు ఈ దుఃఖసాగరమునుంచి నన్ను ఏ విధముగా రక్షించునో అది నువ్వు చూడుము’. ||67.35||


||శ్లోకము 67.36||


ఇమం చ తీవ్రం మమ శోకవేగం

రక్షోభిరేభిః పరిభర్త్సనం చ |

బ్రూయాస్తు రామస్య గతస్సమీపమ్

శివశ్చ తేఽధ్వాస్తు హరిప్రవీర ||67.36||


స|| హరిప్రవీర రామస్య సమీపం గతః మమ ఇమం తీవ్రం శోకవేగం ఏభిః రక్షోభిః పరిభర్త్స్యనం చ బ్రూయాః | తే అధ్వా శివః అస్తు ||


||శ్లోకార్థములు||


హరిప్రవీర రామస్య సమీపం గతః -

 ఓ వానరోత్తమా ! రాముని వద్దకు పోయి 

మమ ఇమం తీవ్రం శోకవేగం - 

నా ఈ తీవ్రమైన శోకము గురించి

ఏభిః రక్షోభిః పరిభర్త్స్యనం చ - 

ఈ రాక్షసులచేత భయపెట్టబడుతున్న విషయమును 

 బ్రూయాః - చెప్పుము

తే అధ్వా శివః అస్తు -  ప్రయాణమునకు సాగుతున్న నీకు  శుభము అగు గాక


||శ్లోకతాత్పర్యము||


’ఓ వానరోత్తమా ! రాముని వద్దకు పోయి నా ఈ తీవ్రమైన శోకము గురించి రాక్షసులచేత భయపెట్టబడుతున్న విషయమును చెప్పుము.  ప్రయాణమునకు సాగుతున్న నీకు శుభము అగు గాక’. ||67.36||


||శ్లోకము 67.37||


ఏతత్త వార్యా నృపరాజసింహ 

సీతా వచః ప్రాహ విషాదపూర్వమ్ |

ఏతచ్చ బుద్ధ్వా గదితం మయా త్వమ్

శ్రద్దత్స్వ సీతాం కుశలాం సమగ్రామ్ ||67.37||


స||  నృపరాజసింహ ఆర్యా సీతా విషాదపూర్వం ఏతత్ వచః తవ ఆహ | మయా గదితాం తత్ బుధ్వా సీతాం సమగ్రాం  కుశలాం శ్రద్ధత్స్వ ||


||శ్లోకార్థములు||


నృపరాజసింహ ఆర్యా సీతా - 

ఓ మహారాజా ! పూజ్యనీయురాలైన సీత 

విషాదపూర్వం ఏతత్ వచః - 

విషాదముతో కూడిన ఈ మాటలను

తవ ఆహ - నీ కోసమని చెప్పినది

మయా గదితాం తత్  - నా చేత చెప్పబడిన దానితో   

సీతాం సమగ్రాం  కుశలాం బుధ్వా - 

సీత కుశలము గా వున్నదని తెలిసికొని 

 శ్రద్ధత్స్వ - శ్రద్ధవహించుము


||శ్లోకతాత్పర్యము||


’ఓ మహారాజా ! పూజ్యనీయురాలైన సీత విషాదముతో కూడిన ఈ మాటలను నీకు చెప్పమని చెప్పినది. నా చేత చెప్పబడినది తెలిసికొని  సీత కుశలము గా వున్నదని  తెలిసికొని , శ్రద్ధవహించుము.’  ||67.37||


హనుమ ఈ విధముగా అశోక వనములో సీతమ్మతో చెప్పిన మాటలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడన్నమాట.


ఈ మాటతో శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఏడవ సర్గ సమాప్తము.


 ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే 

చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్

శ్రీమత్సుందరకాండే సప్తషష్టితమస్సర్గః||



|| ఓమ్ తత్ సత్||