!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 299-301
॥ఓమ్ తత్ సత్॥
వివేక చూడామణి 299-301 శ్లోకములు:
298వ శ్లోకములో త్యజ అభిమానం కులగోత్ర నామ అంటూ,
గురువు అవన్నీ వదిలేసి అఖండ సుఖస్వరూపుడవు కమ్ము అని
చెప్పాడు. అలా అన్నీ వదిలేయడానికి ముఖ్యమైన
ప్రతిబంధకము మన అహంకారము. ఈ అహంకారము వదిలేయకపోతే
అత్మాను భూతి కలుగదు. అది ఇప్పటిదాకా మనము అనేకసార్లు
విన్నమాట.
గురువు ఇప్పుడు 13శ్లోకాలలో ( 299-311) ఆ
అహంకారము గురించే చెపుతాడు
శ్లోకము 299
సన్తి అన్యే ప్రతిబన్ధాః పుంసః
సంసార హేతవో దృష్టాః।
తేషాం ఏషాం మూలం ప్రథమ
వికారో భవత్యహంకారః
సన్తి అన్యే ప్రతిబన్ధాః పుంసః-
పురుషునికి ఇంకా అనేకప్రతిభంధకాలు వున్నాయి
ఏమిటా ప్రతిబంధకాలు ?
సంసార హేతవో దృష్టాః:
సంసార సాగరానికి కారణాలు
పురుషుడు సంసార సాగరములో మునిగిపోవాడానికి కారణాలు
చాలా వున్నాయి. అవే అత్మజ్ఞానముకు వ్యతిరేకమైన,
అంటే అడ్డుపడే ప్రతిబంధకములు కూడా. అవి
అనేకము. .
తేషాం ఏషాం మూలం-
అట్టి ప్రతిబంధకాలలో మూలమైనది;
వాటన్నిటిలో మూలము అహంకారము, తరువాత రాగద్వేషములు
లాంటివి వస్తాయి. అహంకారమే లేకపోతే మిగతావాటికి అధారము
వుండదు. అదే మాటతో గురువు ఈ శ్లోకము పూర్తిచేస్తాడు
ప్రథమ వికారో భవత్యహంకారః -
ప్రథమ వికారః భవతి అహంకారః -
మొదటి వికారము అహంకారము;
ఇదే మూలము. ఈ అహంకారము, నేను నాది అన్నమాట లేకపోతే ఇక
కోరికలు ఎక్కడ? అందుకే దీనిని వదిలెయ్యాలి అని భావము.
తాత్పర్యము:
"పురుషుడికి , అత్మజ్ఞానముకు వ్యతిరేకమైన
ప్రతిబంధకములు అనేకము వున్నాయి. అట్టి ప్రతిబంధకాలలో
మూలమైనది మొదటి వికారము అదే అహంకారము."
శ్లోకము300
యావత్ స్యాత్ స్వస్య సమ్బన్ధో
అహంకారేణ దురాత్మనా।
తావన్న లేశమాత్రాపి
ముక్తివార్తా విలక్షణా॥
యావత్ స్యాత్ స్వస్య సమ్బన్ధో -
యావత్ ఎప్పటిదాకా తనయొక్క బంధములు వుండునో
అహంకారేణ దురాత్మనా।
దుష్టస్వభావము గలవాని అహంకారము వలన
తావన్న లేశమాత్రాపి - తావత్ న లేశమాత్రేణ
అప్పటివరకు లేశమాత్రమైనా
ముక్తివార్తా విలక్షణా(న) -
బంధ విలక్షణమైన ముక్తి యొక్క వార్త వుండదు
అంటే అహంకారము వున్నవాడికి ముక్తి అన్నమాట వుండదు అని.
అంటే అహంకారము లేనివాడికి ముక్తి లభింవచును, కాని
అహంకారము వున్నవాడికి ముక్తి అన్నమాట ఉండనే వుండదు.
శ్లోకము 300 - తాత్పర్యము:
"యావత్ ఎప్పటిదాకా తనయొక్క బంధములు వుండునో అప్పటివరకు
దుష్టస్వభావము గలవాని అహంకారము వలన లేశమాత్రమైనా
బంధవిలక్షణమైన ముక్తి యొక్క వార్త వుండదు."
శ్లోకము 301
అహంకారగ్రహాత్ ముక్తః
స్వరూపముపపద్యతే।
చన్ద్రవత్ విమలః పూర్ణః
సదానన్దః స్వయం ప్రభః॥
1అహంకారగ్రహాత్ ముక్తః-
అహంకారమనే గ్రహమునుంచి బయటపడిన వాడు:
2 స్వరూపముపపద్యతే -
తన నిజస్వరూపమును పొందును.
అహంకారము ఒక గ్రహము లాంటిది. ఆ గ్రహము పట్టినప్పుడు
అహంకారము ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని కప్పివేస్తుంది.
దానినుంచి బయట పడిన వాడు - నిజస్వరూపమును
చూడగలుగుతాడు. దానికి ఉదాహరణ పూర్ణ చంద్రగ్రహణము
తరువాత పూర్ణ చంద్రుని ఎలా చూడగలుగుతామో అలాగే
అహంకారముపోగానే మన నిజస్వరూపము మనకి తెలిసివస్తుంది
అని భావము. అదే మాట ఇంకో విధముగా, చంద్రుని
కప్పి వేసిన మేఘాలు తొలగి పోగానే, పూర్ణచంద్రబింబము
కనపడ్దట్లు , అహంకారము పోయినవాడు , తన నిజస్వరూపము
పొందుతాడు అన్నమాట. ఈ మాటె ముందు పాదములో వస్తుంది
ఆ నిజ స్వరూపము ఎలాంటిది?
3 చన్ద్రవత్ విమలః పూర్ణః
పూర్ణ చంద్ర బింబము వలె స్వచ్చముగా (వుండును)
4 సదానన్దః స్వయం ప్రభః-
సదాన్దస్వరూపుడై స్వయముగా ప్రకాశించువా డగును.
301 వ శ్లోకము తాత్పర్యము:
"అహంకారమనే గ్రహమునుంచి బయటపడిన వాడు పూర్ణ చంద్ర
బింబము వలె సదాన్దస్వరూపుడై స్వయముగా ప్రకాశించువాడై
తన స్వరూపమును పొందును."
______________________________________________
______________________________________________