!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 424-426
ఇక్కడ శ్లోకాలలో మళ్ళీ గురువు ఆత్మజ్ఞానముయొక్క ఫలములు విశదీకరిస్తున్నాడు. అజ్ఞాన దశలో, సంసారసాగరములో కొట్టుమిట్టాడుతున్న జీవుడు, ఆత్మజ్ఞానము గురించి తెలియకముందు, తన హృదయములో అనేక మైన బంధాలు ఇమడ్చుకొని యుంటాడు. ఈ బంధాలని హృదయ గంథులు అంటారు శంకరాచార్యులవారు. హృదయములో వున్న ముళ్ళని అంటే బంధాలను నాశనము చెయ్యాలి అప్పుడే ఆత్మ దర్శనమౌతుంది. ముందు శ్లోకాలలో ఈ హ్రుదయగ్రంథులను నాశనము చెయ్యి అని విన్నాము. ఇక్కడ గురువు ఆ హృదయ గ్రంధులను నాశనము చెయ్యడముతో కలిసుచచ్చే ఫలముల గురించి చెపుతాడు. హృదయములో వున్నముళ్ళు విడిపోతే, అప్పుడు బంధములు లేని జీవుడు అంటే కోరికలు లేని జీవుడు , అక్కరలేని సంసార సాగరములో దూకడు. అదే మాట ముందు శ్లోకములో.
శ్లోకము 424
అజ్ఞానహృదయగన్ధేః
వినాశో యద్యషేషతః।
అనిఛ్చోర్విదుషః కిం ను
ప్రవృత్తేః కారణం స్వతః॥424॥
1 అజ్ఞానహృదయగన్ధేః -
అజ్ఞాన హృదయ గ్రన్ధులకు
2 వినాశో యద్యషేషతః -
శేషము లేకుండా వినాశనము కలిగినచో
3 అనిఛ్చోర్విదుషః కిం ను -
కోరికలేని విద్వాంసునకు
4 ప్రవృత్తేః కారణం స్వతః -
స్వయముగా ప్రవర్తించుటకు
5 కిం ను కారణం - కారణమేమి వుండును?
424 వ శ్లోకము తాత్పర్యము:
"అజ్ఞాన హృదయ గ్రన్ధులకు శేషము లేకుండా వినాశనము కలిగినచో, కోరికలేని విద్వాంసునకు
స్యయముగా ప్రవర్తించుటకు కారణమేమి వుండును?"
హృదయములోవుండే ముళ్ళు విడిపోతే , ఇక కోరికలే వుండవు. కోరికలు లేని అప్పుడు విద్వాంసుడికి, స్వయముగా దేనికోసమో ముందుకు వేళ్ళవలసిన పని ( ప్రవృత్తి) వుండదు అని భావము
శ్లోకము 425
వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావిథిః।
అహంభావోదయాభావో బోధస్య పరమావధిః।
లీనవృత్తేః అనుత్పత్తిః మర్యాదోపరతేస్తు సా ॥425॥
1 వాసనా అనుదయో భోగ్యే -
భోగములందు వాసనలు ఉదయించ నప్పుడు;
2 వైరాగ్యస్య తదా అవిథిః -
ఆప్పుడు వైరాగ్యము యొక్క పరాకాష్ఠ;
పూర్వము
3 అహంభావోదయాభావః - అహంకారము కలుగకుండా వుండుట ;
4 బోధస్య పరమావధిః - జ్ఞానముయొక్క ఉత్తమమైన అవధి;
5 లీనవృత్తేః అనుత్పత్తిః -
లీనమైన మనోవృత్తి యొక్క అనుత్పత్తి ( అంటే మరల ఉత్పన్నముకాకుండుట;
6 మర్యాదా ఉపరతేస్తు సా -
అది ఉపరతి యొక్క మర్యాద ;
425 వ శ్లోక తాత్పర్యము:
భోగములందు వాసనలు ఉదయించ నప్పుడు, ఆది వైరాగ్యము యొక్క పరాకాష్ఠ; అహంకారము కలుగకుండా వుండుట జ్ఞానముయొక్క ఉత్తమమైన అవధి; లీనమైన మనోవృత్తి యొక్క అనుత్పత్తి అంటే మరల ఉత్పన్నముకాకుండుట; అది ఉపరతి యొక్క మర్యాద ;
శ్లోకము 426
బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్త బాహ్యర్థధీః।
అన్యావేదితభోగ్య భోగకలనో నిద్రాళువత్ బాలవత్।
స్వప్నాలోకిత లోకవత్ జగదిదమ్ పశ్యన్ క్వచిల్లబ్ధధీః॥
ఆస్తేకశ్చిదనన్తపుణ్య ఫలభుగ్ ధన్యః స మాన్యో భువిః॥
1 బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్త బాహ్యర్థధీః
బ్రహ్మాకారతయా సదా స్థితతయా - ఎల్లప్పుడు బ్రహ్మ భావములో ఉండుటచేత
నిర్ముక్త బాహ్యర్థధీః - తొలగిపోయిన బాహ్య విషయముల బుద్ధి కలవాడై
2 అన్యావేదితభోగ్య భోగకలనో నిద్రాళువత్ బాలవత్'
అన్యావేదితభోగ్య భోగకలనో - ఇతరులుచే సమర్పింపబడిన భోగ్యముల భోగముకలవాడై
నిద్రాళువత్ బాలవత్ - నిద్రపోవుచున్నవాని వలెను, బాలునివలెను
బ్రహ్మభావములో బాహ్యవిషయముల ధ్యాసలేనివాడై, నిద్రపోవుచున్న వాని వలె, బాలునివలె, ఇతరులుచే శరీర పోషణకు సమర్పింపబడిన భోగ్యముల (ఆహరముల) భోగము కలవాడై అని. ఇవి జీవన్ముక్తుని లక్షణములు;
3 స్వప్నాలోకిత లోకవత్ జగదిదమ్ పశ్యన్ క్వచిల్లబ్ధధీః
స్వప్నాలోకిత లోకవత్ - స్వప్నములో చూడబడిన లోకమువలె
జగదిదమ్ పశ్యన్ - ఈ లోకమును చూచుచూ
క్వచిల్లబ్ధధీః - క్వచిత్ లబ్ధధీః - ఒకదాని (బ్రహ్మము) యందు స్థిరమైన బుద్ధి కలవాడై;
ఈ జగత్తుని స్వప్నములో చూడబడిన మిథ్యాప్రపంచమువలె చూచుచూ , బ్రహ్మములోనే స్థిరమైన బుద్ధి కలవాడ అని; జగత్తుని స్వప్నములో చూడబడిన మిథ్యాప్రపంచమువలె చూడడము జీవన్ముక్తుని లక్షణము.
4 ఆస్తేకశ్చిదనన్తపుణ్య ఫలభుగ్ ధన్యః స మాన్యో భువిః
అస్తే కశ్చిత్ - ఒకానొక పురుషుడు వుండును
అనన్తపుణ్య ఫలభుక్ - ఆనంతమైన పుణ్యఫలము ( మోక్షము) అనుభవించుచున్న
ధన్యః స మాన్యో భువిః - ధన్యుడైన అతడే భువిలో మాన్యుడు
424 వ శ్లోకము తాత్పర్యము
ఎల్లప్పుడు బ్రహ్మాకారమై ఉండుటచేత తొలగిపోయిన బాహ్యవిషయముల బుద్ధి కలవాడై;నిద్రపోవుచున్నవాని వలెను, బాలునివలెను; ఇతరులుచే సమర్పింపబడిన భోగముల భోగముకలవాడై ; స్వప్నములో చూడబడిన లోకమువలె ఈ లోకమును చూచుచూ; ఒకదానియందు స్థిరమైన బుద్ధి కలవాడై;ఆనంతమైన పుణ్యఫలము ( మోక్షము) ఒకానొక పురుషుడు వుండును; ఆనంతమైన పుణ్యఫలము అనుభవించుచున్న అతడే భువిలో ధన్యుడైన మాన్యుడు ( అతడే జీవన్ముక్తుడు)
______________________________________________________
గురువు ఆత్మ జ్ఞానఫలము గురించి ఇంకా చెపుతాడు ఈ మూడు శ్లోకాలలో
శ్లోకము 421
నివృత్తిః పరమాతృప్తిః
ఆనన్దో అనుపమఃస్వతః।
దృష్టదుఃఖేష్వనుద్వేగః
విద్యాయాః ప్రస్తుతం ఫలమ్॥421॥
1నివృత్తిః పరమాతృప్తిః -
నివృత్తితో గొప్ప తృప్తియు;
నివృత్తి అంటే సకలకార్యములనుండి మరలుట; సకల కార్యములు అంటె బంధము కలిగించే పనులు; బంధము కలిగించే పనుల నుంచి వెనక్కి మరలితే, అంటే నివృత్తితో, పరమ శాంతి పరమ తృప్తి లభిస్తాయి.
2 ఆనన్దో అనుపమః స్వతః -
స్వతస్సిద్ధమగు సాటిలేని ఆనందము;
3 దృష్టదుఃఖేష్వనుద్వేగః :
ప్రాప్తించుచున్న దుఃఖముల విషయమున మనస్సులో బాధపడకుండుట;
4 విద్యాయాః ప్రస్తుతం ఫలమ్ -
(ఇవి) విద్యయొక్క లభించు ఫలములు
విద్య అంటే ఆత్మ జానము అని. ఆత్మ జ్ఞానము వున్నవాడికి వచ్చే లాభాలు చెప్పడమైనది. ఆ లాభాలు - నివృత్తితో తృప్తి , స్వతః సిద్ధమగు సాటిలేని ఆనందము, దుఃఖాలలో బాధపడకుండావుండుట.
421 శ్లోక తాత్పర్యము:
నివృత్తితో గొప్ప తృప్తి, స్వతస్సిద్ధమగు సాటిలేని ఆనందము, ప్రాప్తించుచున్న దుఃఖముల విషయమున మనస్సులో బాధపడకుండుట, ఇవి విద్యయొక్క ఫలములు.॥421॥
శ్లోకము 422
యత్కృతం భ్రాన్తివేళాయాం
నానాకర్మ జుగిప్సితమ్ ।
పశ్చాన్నరో వివేకేన
తత్ కథం కర్తుమర్హతి॥422॥
1 నానాకర్మ జుగిప్సితమ్ -
జుగిప్స కలిగించు అనేక కర్మలు;
2 యత్కృతం భ్రాన్తివేళాయాం -
భ్రాన్తి సమయములో ఎవి చేయబడినవో
3 పశ్చాన్నరో వివేకేన-
ఆ తరువాత నరుడు వివేకముతో;
4 తత్ కథం కర్తుమర్హతి -
అవి ఎట్లు చేయగలడు?
అంటే వివేకము వచ్చిన తరువాత జుగిప్స కలిగించు కర్మలు, వివేకము గలవాడు ఎట్లు చేయగలడు అన్న ప్రశ్న కి సమాధానము, వివేకము గలవాడు చెయ్యడు అని.
వివేకము గల నరుడు భ్రాన్తి సమయములో చేసిన జుగిప్స కలిగించు కార్యములు, ఆ భ్రాన్తి పోయిన తరువాత , ఆ పనులను చేయలేడు.
422 వ శ్లోక తాత్పర్యము
వివేకము గల నరుడు భ్రాన్తి సమయములో చేసిన జుగిప్స కలిగించు కార్యములు, ఆ భ్రాన్తి నివృత్తితో ఆ పనులను చేయలేడు.॥422॥
శ్లోకము 423
విద్యాఫలం స్యాత్ అసతో నివృత్తిః
ప్రవృత్తిః అజ్ఞాన ఫలమ్ యదీక్క్।
తత్ జ్ఞాజ్ఞయోః మృగతృష్ణికాదౌ
నోచేత్ విదో దృష్టఫలం కిమ్ అస్మాత్॥
1 విద్యాఫలం స్యాత్ అసతో నివృత్తిః -
లేని దాని గురించి వెనుకకి మళ్ళుట విద్యయొక్క ఫలము:
విద్యవలన అంటే జ్ఞానము వలన ఫలము అసద్వవస్తువుల ( ఇ జగత్తు మాయ అనే భావముతో) నుంచి మనస్సు వెనుకకి మళ్ళుట అదే నివృత్తి.
2 ప్రవృత్తిః అజ్ఞాన ఫలమ్। -
ప్రవృత్తి యొక్క ఫలము అజ్ఞానము;
అజ్ఞానము వలన ఈ ప్రపంచమే నిజము అనే భావము అందులో మునిగి తేలడము (అదే ప్రవృత్తి)
3 తత్ జ్ఞాజ్ఞయోః మృగతృష్ణికాదౌ-
అది జ్ఞానులు అజ్ఞానులకు ఎండమావులలో ( కనపడును).
ఎండమావులలో జ్ఞాని భ్రాన్తి పొందడు నీరు లేదు అని చలించడు దుఃఖపడడు. అజ్ఞాని ఎండమావులలో, భ్రాన్తిలో చూచిన నీరు కనపడక దుఃఖములో పడును.
4 నోచేత్ విదో దృష్టఫలం కిమ్ అస్మాత్ -
అలా కానిచో జ్ఞానులకు దీనికన్న భిన్నమైన ఫలము ఏమున్నది?
జ్ఞాని ఆజ్ఞానులలో ఆ భేదము లేకపోతే , విద్యయొక్క ఫలము ఎమిటి అన్న ప్రశ్నతో, గురువు విద్యయొక్క ఫలము అదే అని తేట తెల్లము చేస్తున్నాడు.
423 వ శ్లోక తాత్పర్యము:
నివృత్తి అంటే లేని దాని గురించి వెనుకకి మళ్ళుట విద్యయొక్క ఫలము. ప్రవృత్తి యొక్క ఫలము అజ్ఞానము. అది జ్ఞానులు అజ్ఞానులకు మృగతృష్ణలో కనపడును.॥423॥
________________________________________________________
__________________________________